Krishna Pushkaralu - 2016
Winners of IoT Workshop CM Awardees Photos @ Krishna Pushkaralu 2016

స్వాగతం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం


సాహిత్యం

కదలిరావే కృష్ణవేణి


-కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి


కదలిరా నిత్య కల్యాణీ!
కదలిరా కడుపు చల్లనితల్లి
జలజలా పొంగుతూ, కిలకిలా నవ్వుతూ

కోటి తీర్థాలు నీ నోటిలో దాచి ము
క్కోటి దేవతలు నీ పైటలో ముడివైచి
కదలిరా కదలిరా కదలిరాయని రాణి
ఎదురు చూచుచు నున్న తెలుగు మాగాణి

శ్రీశైల మల్లయ్య ఆశీస్సుధలు చిలుక
నాగార్జునులు నీకు స్వాగతమ్మును పలుక
వేదాద్రి నరసింహు పాదాలు స్పర్శించు
అమరేశ్వరస్వామి ఆలయము దర్శించి

గణగణా మ్రోగేటి మణిమేఖల ధరించి
కనకదుర్గమ్మ గుడి గంటలకు పులకించి
చిరునవ్వు పొరలలో సురులు నిండించుకుని
అలలలో బంగారు కలలు పండించుకుని

గురుడు కన్యారాశి కరుదెంచు శుభవేళ
విరబూచునంట పుష్కరము నీ కెరటాల
నీ వారిలో మునుగు మావారి కరుణింప
దేవతలునీ మహిమ కైవార మొనరింప

ఆంధ్ర విష్ణువు హేతి ఆరామమల ఖ్యాతి
ఉభయ రామేశ్వరము లుద్భవించిన రీతి
కగళమెత్తి పాడుతూ నలుదెసల చాటుతూ,
ల హంసగమవె కలి కలుషశమనవై....


కృష్ణవేణీ...దివ్య సుందరీ!


-అడివి బాపిరాజు


మహాబలేశ్వర జటామకుట వినిర్గత సుందరీ కన్నబెన్నా! పశ్చిమాద్రితనయా!
మలయసానుజా! శీతల వాయుదేవ సహోదరీ, నీలనదీ మృదమదము గదం
బించే నీనీల నీరాలలో విజయపుర ఇక్ష్వాకు రాజాంత:పుర వక్షోజ చందన
చర్చలు కలసి కదలిపోతున్నవి.
ఏనాటి కాంతవు. యుగయుగాల నుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు
నువ్వు. గంగా సింధఱు యమునా బ్రహ్మపుత్రులు నీకు కడగొట్టు చెల్లెళ్లు..నీవూ
గోదావరి కవలపిల్లలు. నీవే జంబూనదివి నీ ఇసుకలో బంగారు కణికలు.
బంగారు రజను మిలమిల మెరిసిపోయేది. ఈనాటికీ నీ తీరాన స్వర్ణగిరి
నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీర గర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి, నీనీ రతనాల బొజ్జ.
కృష్ణవేణీ! నీలనదీ!ప్రేమమయీ! అనేకాంధ్ర సార్వభౌమ సహచరీ! ఆంధ్రాం
గనా! నీవే నిలవపుషనై. లోకానికి నిత్యత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటావు. నీవు
నిర్మలాంగివై. నిత్య సృష్టిని లోకానికి పాటపాడి వినిపిస్తూ ఉంటావు. ప్రతియా
మినీ నీరవఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు
పలుకుతూ ఉంటావు. నీవు ఆంధ్ర వసుంధరవా నీలమేఖలవు.
గోదావరి ఏకాశలి. మహానదీ తపతులు అయమ్మ బాహువులు, నర్మద చెంప
సరులు. కావేరీ వేగైలు ఆమెకు మంజీరాలు.
కృష్ణవేణీ! దివ్యసుందరీ! మనోహర నృత్య విలాసినీ! నమో నమస్తే.


యెంత చల్లని తల్లివే!


- కళాప్రపూర్ణ దాశరథి


క్షితివెన్నెన్ని యుగాల నుండి భవ దక్షిణ ప్రవాహము భా
రత దేశస్థ మహాంధ్రమున్ తడిపెనో! రత్నాలు పండించెనో!
పతియౌ అంబుధి నిన్ను వీచికలతో బంధించి ప్రేమించెనో!
సతులందితును పుష్కరవ్రత విధిన్ నా తల్లి కృష్ణాపగా!

పుష్కరము వేళ నీనీట మునుగు మాకు
పూత మందాకినీ గాహ పుణ్యమబ్బు
ఈ మహాపర్వమందు తల్లీ! తద్వీయ
వారి ధారల గ్రుంటవలన ముక్తి

తనువు తాపము, మానసతాప మెడల
తల్లి! నీ పాద తీర్ధమ్ము త్రావినాము,
నీదు బిడ్డల గుండె నిండ నీవు
ధారవోతువు కరుణా రసమ్ము
స్నానాదులు నీ పుష్కరాన జరుప
మానవాళి యఘములు మాసిపోవు,
యెంత చల్లని తల్లివే! యెడదలోని మంటలారును నీవారినంటగానె
ఇంద్రకీలాచలమ్మెంత యెత్తో, అంత
లోతు నీ గుండో! మా దివ్యమాత వమ్మ!
కృష్ణవేణమ్మ! తెలుగమ్మ! తృష్ణవాపి
మాకు జ్ఞానదానము చేసి మనుపుమమ్మ

  కృష్ణ పుష్కరం - 2016

పుష్కరాలు ఎలా వచ్చాయంటే.. :

సృష్టి ఆరంభ సమయంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోరతపస్సు ఆచరించి, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తుందిలుడు పరమానందభరితుడై తనకు ఈశ్వరుడిలో శాశ్వత స్థానం కల్పించమని అర్థించాడు. అందుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలునికి శాశ్వతస్థానం కల్పించాడు. ఆవిధంగా మూడున్నర కోట్ల తీర్థాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. కావున పుష్కరుడయ్యాడు. పుష్కరుడు అంటే పుణ్యజలం మరియు పోషించేవాడని కూడా అర్థం ఉంది. సృష్టి నిర్మాణక్రమంలో బ్రహ్మదేవునికి జలంతో అవసరం ఏర్పడగా, జలాధికారియైన పుష్కరుని తనకు ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుని చతుర్ముఖుడు కోరుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించడంతో పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలో ప్రవేశించాడు. ఒక సందర్భంలో సకల జీవరాశిని పునీతం చేసేందుకు ప్రాణులకు జీవనాధారమైన జలాన్ని ఇవ్వాల్సిందిగా బృహస్పతి బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలివెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషరాశి మొదలు 12 రాశుల్లో ప్రవేశించినపుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పూర్తిగాను, మిగతా రోజుల్లో మధ్యాహ్న సమయంలో బృహస్పతి అధిపతిగా ఉన్న నదిలో పుష్కరుడు కొలువై ఉంటాడు. ఆ కారణంగా బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి.


ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరం వస్తుందంటే.. :

1. మేషరాశి : గంగానది
2. వృషభ రాశి : రేవా నది
3. మిథున రాశి : సరస్వతీ నది
4. కర్కాటక రాశి : యమునా నది
5. సింహ రాశి : గోదావరి నది
6. కన్య రాశి : కృష్ణా నది
7. తులా రాశి : కావేరి నది
8. వృశ్చిక రాశి : భీమారథీ నది
9. ధనూ రాశి : పుష్కరవాహిని (తపతి)
10. మకర రాశి : తుంగభద్రా నది
11. కుంభ రాశి : సింధూ నది
12. మీన రాశి : ప్రాణహితా నది


జగన్మాతకు జగదైక హారతి

ఇలవేల్పులకు ఇచ్చే హారతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరెంతో పవిత్రత ఉంది. హారతితో సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై త్రిలోక సంచారిణి దుర్గమ్మకు వేదపండితుల మంత్రో చ్చారణ నడుమ ఆరు హారతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ హారతిని దర్శస్తే పాపాలు తొలగి శుభం చేకూరుతుందని పురోహితులు, పండితులు చెబుతున్నారు. ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల సమయంలో అంతరాలయంలో అమ్మవారికి హారతి ఇస్త్తున్నారు. ఈ హారతులను దసరా, పండుగ సందర్భాల్లో తప్ప మిగతా రోజుల్లో ప్రత్యేక దర్శనం టికెట్టు ద్వారా చూడవచ్చు.

సింహ హారతి (విజయ చిహ్నం)

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపంగ సింహహారతి. జగన్మాత దుర్గ మ్మ వాహనం సింహం. ఉత్సవాల్లో సైతం ఆమెను సింహవాహనంపై ఔరేగిస్తారు. సింహాన్ని వాహ నంగా చేసుకుని దుష్ట శిక్షణలో దుర్గమ్మ విజయం సాధించినందున సింహహారతిని ఇస్తున్నారు.

ఓంకార హారతి (సకలపాపహరణం)

సృష్ట్టికి మూలం ఓంకారం. దుర్గమ్మను ఓంకార స్వరూపిణిగా కీర్తిస్తారు. ఓంకార రూపాన్ని చూడటంతో సర్వపాపాలు హరిస్తాయి. శుభం కలుగుతుందన్న విశ్వాసంతో తొలి హారతిగా ఓం కారాన్ని సమర్పిస్తారు.

నాగ హారతి (నాగహార సర్పదోష నివారణ)

సర్పదోష నివారణ హారతిగా నాగహారతిని భక్తులు విశ్వసిస్తారు. నాగహారతిని దర్శించుకోవడం వల్ల సంతాన సౌభాగ్యం, దీర్ఘాయువు కలుగుతుంది. సర్పదోషాలు తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది.


పంచహారతి (ఈశ్వర ప్రతిరూపం)

పంచ మహాపాతకాలు దరి చేరనిది పంచహారతి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే ఐదు నామాలతో ఈశ్వ రునికి ప్రతిరూపం పంచహారతి. ఇంద్ర కీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మతో పాటు మల్లేశ్వర స్వామికి ఇదే విధంగా హారతులు ఇవ్వ డం ద్వారా ఈశ్వర కటా క్షం భక్తులకు సిద్ధిస్తుంది. దీంతో పరిపూ ర్ణత లభిస్తుంది.

కుంభహారతి (ప్రశాంతత)

సకల ప్రాణికోటి రక్షణకు ప్రతిరూపం కుంభ హారతిని దర్శించడంతో సమాజ శ్రేయస్సు కలుగుతుంది. పంచభూ తా త్మకమైన జీవరక్ష కలుగుతుంది. మనసు కు ప్రశాంతతను చేకూర్చేందుకు ఈ హారతిని దర్శించుకుంటే సరిపోతుంది.

నక్షత్ర హారతి (సకల పాపహరణం)

అన్ని హారతులు పూర్తయిన తరువాత చివరగా ఇచ్చే హారతి నక్షత్ర హారతిని మానవాళి మనుగడను తెలియజేస్తుంది. 27 నక్షత్రాల సంచారం ద్వారా మానవాళి గ్రహగతులు, జీవన విధానం తెలుస్తోంది. ఏ నక్షత్రంలో పుట్టిన వారైనప్పటికీ నక్షత్ర హారతిని దర్శించుకోవడంతో అన్ని పాపాలు తొలిగిపోయి శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం.


సంప్రదించండి

చిరునామా

ల్యాండ్లైన్ సంఖ్యలు : 0866-2474700 ; 0866-2474701

మొబైల్ నంబర్స్ : 7702201597;7702201598;9000705973;9866449521

krishnapushkaramcell@gmail.com

Copyright © ITE&C Department Government of Andhra Pradesh | Visitors : www.reliablecounter.com
     

<